వెంకటేశ్ హీరోగా బి. గోపాల్ డైరెక్ట్ చేసిన 'బొబ్బిలి రాజా' (1990) బాక్సాఫీస్ దగ్గర దుమ్ము దులిపేసింది. 3 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, వెంకటేశ్ కెరీర్‌లోనే మొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డులకెక్కింది. ఇందులో వెంకటేశ్, హీరోయిన్ దివ్యభారతి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. విడుదలై 32 సంవత్సరాలైనా.. ఇప్పటికీ ఆ సినిమాని ప్రేమించే వాళ్లు ఎందరో! ఒకానొకప్పుడు 'బొబ్బిలి రాజా'కు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉన్నట్లు మీడియాతో సంభాషణలో చెప్పారు వెంకటేశ్.
అయితే తర్వాత కాలంలో ఆ ఆలోచనను పక్కన పెట్టేశారు. దానికి బదులుగా తన కుమారుడు రానాతో 'బొబ్బిలి రాజా'ను రీమేక్ చేయాలని నిర్మాత డి. సురేశ్‌బాబు అనుకున్నారు. రానాకు ఇది మాస్‌లో మంచి ఇమేజ్ తీసుకొచ్చే సినిమా అవుతుందనేది ఆయన అభిప్రాయం. రానా సైతం ఆ సినిమా చెయ్యడానికి ఉత్సాహం చూపించారు. దానికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని ప్రచారంలోకి వచ్చింది. ఇది జరిగి పదేళ్లయిపోయింది.
కానీ.. ఎందుకనో 'బొబ్బిలి రాజా' రీమేక్ పనులు ఇప్పటి వరకూ వాస్తవ రూపం దాల్చలేదు. ఇప్పటికీ రానాతో ఎవరో ఒకరు ఆ రీమేక్ గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. నిజానికి ఆ రీమేక్ చేయడానికి ఇదే సరైన సమయంగా ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మరి కొంతకాలం గడిస్తే.. వయసు రీత్యా ఆయనకు ఆ క్యారెక్టర్ సరిపోకపోవచ్చని వారు సలహా ఇస్తున్నారు. రానా ఏం చేస్తాడో చూడాలి మరి.